కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్?

July 20, 2019


img

వార్డుల విభజన, రిజర్వేషన్లలో అవకతవకలపై ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే కారణంగా జగిత్యాల మున్సిపల్ ఎన్నికలపై స్టే విధించింది కూడా. అయినప్పటికీ కొందరు రాజకీయ నేతలు తమ ప్రయోజనాల కోసం మున్సిపల్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ వార్డులు, డివిజన్లు, తర్ల జాబితాలను, రిజర్వేషన్లను తారుమారు చేయిస్తూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో ఇదే కారణంగా హైకోర్టు స్టే విధించినట్లు తెలుస్తోంది. 

కార్పొరేషన్ పరిధిలోని 2,3, 18 డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓటర్ల జాబితాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిలో 26 మంది ఇంప్లీడ్‌ అయినట్లు తెలుస్తోంది. రెండవ డివిజనులో ఎస్టీ ఓటర్లున్న ఇళ్లను మాత్రమే జాబితాలో చూపించి, మిగిలినవారిని 3వ డివిజనులోకి మార్చినట్లు వారు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా 3వ డివిజనులో ఉండే 350 ఎస్టీ ఓటర్ల జాబితాను 2వ డివిజనులో ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. 18వ డివిజనులో 600 మంది అగ్రవర్ణ ఓటర్లను బీసీలుగా పేర్కొన్నారని ఫిర్యాదు చేశారు. 40వ డివిజనులో ఒకే ఇంటిలో 100 మంది ఓటర్లున్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇటువంటివే ఇంకా అనేక అవకతవకలను పిటిషనర్లు సాక్ష్యాధారాలతో సహా సమర్పించడంతో వాటిపై విచారణ జరిపిన హైకోర్టు, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అవకతవకలన్నీ సరిచేసేవరకు ఎన్నికలు నిర్వహించరాదని ఆదేశించినట్లు తాజా సమాచారం. ఒకవైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, మరోవైపు హైకోర్టు ఆగ్రహంతో మున్సిపల్ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


Related Post