బాబు దీక్షలో రాహుల్ కు ఇబ్బంది

February 11, 2019


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఈరోజు డిల్లీలో ఏపిభవన్ లో చేస్తున్న ధర్మపోరాటదీక్షకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అనేకపార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన లోక్‌సభ తాంత్రిక్ జనతా దళ్ అధినేత శరద్ యాదవ్ మాట్లాడిన కొన్ని మాటలు వేదికపైనే ఉన్న రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ తదితర కాంగ్రెస్‌ నేతలు కొంచెం ఇబ్బందిపడ్డారు. 

కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న మహాకూటమికి ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పగలరా అంటూ బిజెపి నేతలు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా, “గతంలో ఈవిధంగా కూటములు ఏర్పడినప్పుడు అవి ప్రధానమంత్రి అభ్యర్ధిని ముందుగా ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించాయి. గెలిచిన రెండు రోజులలోపుగానే ప్రధానమంత్రిని ఎన్నుకొన్నాయి.,” అని అన్నారు. 

ఇంతవరకు బాగానే ఉంది కానీ గతంలో కూటములు ప్రధానమంత్రిని ఏవిదంగా ఎన్నుకున్నాయో ఉదాహరణలు చెపుతూ, “1975-77లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి నిరంకుశపాలన సాగిస్తున్నప్పుడు జనతాపార్టీ నేతృత్వంలో ఇదేవిధంగా కూటమి ఏర్పడి ఆమెను ఓడించింది. వెంటనే మురార్జీ దేశాయ్ ను ప్రధానమంత్రిగా ఎన్నుకొంది. కనుక మా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరు? అని బిజెపి నేతలు మమ్మల్ని నిలదీసేబదులు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తామా లేదా? అని ఆలోచించుకుంటే మంచిది.” అని అన్నారు. 

ఇందిరా గాంధీ నిరంకుశత్వ పాలన గురించి శరత్ యాదవ్ చెపుతుంటే, అదే వేదికపై ఉన్న ఆమె మనుమడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. మరో విచిత్రమేమిటంటే ఆనాడు ఇందిరాగాంధీ నిరంకుశపాలనను అంతమొందించడానికి కూటమి ఏర్పడగా, ఈసారి నరేంద్రమోడీ నియంతృత్వపాలనను అంతమొందించడానికి అదే కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమి ఏర్పాటవుతోంది. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్ పార్టీని బద్ధశత్రువుగా భావించిన చంద్రబాబునాయుడు ఇటువంటి వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రాంతీయపార్టీలను కూడగడుతుండటం మరో విశేషం.


Related Post