మూడు టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్‌ భూమిపూజ నేడే

April 26, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లో మరో మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సస్ (టిమ్స్‌)లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటికి ఈరోజు సిఎం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. 

ముందుగా ఈరోజు ఉదయం 11.30 గంటలకు గడ్డి అన్నారంలో టిమ్స్‌కు భూమిపూజ చేస్తారు. ఆ తరువాత సనత్ నగర్‌ ఛాతి వ్యాధుల ఆస్పత్రి ప్రాంగణంలో, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆల్వాల్ వద్ద టిమ్స్‌కు భూమిపూజ చేస్తారు. ఈ సందర్భంగా ఆల్వాల్ వద్ద బహిరంగ సభ నిర్వహించి మాట్లాడుతారు.      

ఈ మూడు టిమ్స్‌ కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,679 కోట్లు ఖర్చు చేయనుంది. వీటిలో గడ్డి అన్నారం, ఆల్వాల్  టిమ్స్ కొరకు చెరో రూ.900 కోట్లు, సనత్ నగర్‌ టిమ్స్ కొరకు రూ.897 కోట్లు ఖర్చు చేయబోతోంది. వీటి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ఏర్పడుతాయి కనుక నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్‌పై ఒత్తిడి కూడా తగ్గుతుంది. నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేయడం వలన ఆయా ప్రాంతాల ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Related Post