నాకు ఏ రోగం లేదు... పుకార్లు నమ్మకండి: చిరంజీవి

June 03, 2023
img

మెగాస్టార్ చిరంజీవి శనివారం హైదరాబాద్‌లో స్టార్ హాస్పిటల్లో ఆంకాలజీ (క్యాన్సర్) విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నంలో కొంతకాలం క్రితం తనకు వచ్చిన ఓ ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుతూ, “సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న మావంటివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ద చూపుతుంటారు. మంచి పౌష్టికాహారం తీసుకొంటూ, ప్రతీరోజు వ్యాయామాలు అవీ చేస్తూ ఎప్పుడూ ‘ఫిట్’గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాము. నాకైతే ఎటువంటి దురలవాట్లు కూడా లేవు. కనుక క్యాన్సర్ వంటి జబ్బులు నా దరిదాపులకు కూడా రాదని గట్టి నమ్మకం ఉండేది. 

అయితే ఓసారి నేను ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకొంటే రెండు పాలిప్స్ ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. వాటి వలన ఎలాంటి ఇబ్బందీ లేదు కానీ వదిలేస్తే అవి క్రమంగా పెరిగి భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారుతాయని చెప్పి వాటిని వెంటనే తొలగించారు. నాకు క్యాన్సర్ మీద అవగాహన ఉంది కనుక ముందుజాగ్రత్తగా పరీక్ష చేయించుకొంటే ఇది బయటపడింది. ప్రాధమికదశలోనే నేను వైద్యుడిని సంప్రదించి ఆ పాలిప్స్ తొలగించుకోవడం వలన ఇప్పుడు నిర్భయంగా ఉన్నాను. 

క్యాన్సర్ గురించి ఈ అవగాహన లేక చాలా మంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. దానికి వారొక్కరే కాదు వారి కుటుంబం అంతా బాధ పడాల్సివస్తుంది. కనుక అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, 40 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరూ ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకొంటే, ఒకవేళ ఉంటే ప్రాధమికదశలో సులువుగా దానిని నివారించవచ్చు. ఈ క్యాన్సర్ అవగాహన కోసం నేను నా వంతుగా ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు. 

చిరంజీవి చాలా స్పష్టంగానే చెప్పారని అర్దమవుతూనే ఉంది. కానీ కొన్ని వెబ్‌సైట్స్, సోషల్ మీడియాలో చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందని, కాదు క్యాన్సర్ వస్తే చికిత్స చేయించుకొని బయటపడ్డారంటూ రకరకాలుగా కధనాలు వ్రాసిపడేశాయి. అవి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో సోషల్ మీడియాలో పెద్ద సందేశం పెట్టాల్సివచ్చింది. నేను కొలెన్ స్కోప్ అనే పరీక్ష చేయించుకొన్నాను తప్ప క్యాన్సర్ బారిన పడలేదని, కానీ మీడియా తప్పుగా అర్దం చేసుకొని వేరేగా వ్రాసిందంటూ చిరంజీవి దానిలో పేర్కొన్నారు. చిరంజీవి ఏమన్నారో ఆయన మాటలలోనే...       



Related Post