ప్రపంచదేశాలలో మళ్ళీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ, అవి భారత్‌కు, తెలంగాణ రాష్ట్రానికి కూడా విస్తరించాయి. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి లక్షణాలు కనబడ్డాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్ఎన్-1 కేసుల సంఖ్య 9కి చేరింది. అయితే ఈ కొత్త వేరియెంట్‌ని నిర్ధారించుకొనేందుకు వారి నుంచి సేకరించిన నమూనాల రిపోర్టులు ఇంకా రావలసి ఉంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా వైద్య అధికారులు వారిని ఐసోలేషన్‌లో ఉండమని సూచించి, రోగ లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు మళ్ళీ గాంధీ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్‌లో 50 పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు వగైరాలతో ప్రత్యేక వార్డులు సిద్దం చేసి ఉంచారు. కరోనా కేసుల పెరుగుదలని బట్టి మళ్ళీ హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వాసుపత్రులలో కరోనా వార్డులు, వైద్యులు, సిబ్బందిని సిద్దం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.
తెలంగాణలో చలీకాలం ప్రభావంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, మంచు కురుస్తుండటం, హైదరాబాద్‌లో క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలు, హైదరాబాద్‌కు దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడం, అలాగే తెలంగాణ నుంచి వేల సంఖ్యలో అయ్యప్పభక్తులు శబరిమల వెళ్ళివస్తుండటం వలన రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కనుక ప్రజలందరూ ప్రభుత్వ మార్గదర్షాకాల కోసం ఎదురుచూడకుండా వెంటనే మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది.