ఎన్నికలొస్తున్నాయి... మెడికల్ కాలేజీలు కూడా వచ్చేస్తున్నాయి!

June 08, 2023
img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు వరాలు కురిపించడం మొదలుపెట్టింది. ఇంతకాలం ఎంత మొత్తుకొన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుగా ఎన్నికలు జరుగబోతున్న తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా 12 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. దాని తర్వాత ఎన్నికలు జరుగబోయే ఏపీకి 5 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. అలాగే రాబోయే ఏడాదిలో ఎన్నికలు జరుగబోయే అన్ని రాష్ట్రాలకు కలిపి మరో 33 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. 

తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జిల్లాకొకటి చొప్పున మెడికల్ కాలేజీలు నిర్మిస్తోంది. ఇప్పుడు వాటికి అదనంగా మరో 12 మెడికల్ కాలేజీలు మంజూరు అవడంతో రాష్ట్రంలో మెడికల్ సీట్లు, వైద్య వసతులు భారీగా పెరుగుతాయి. 

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, మేడ్చల్, వరంగల్‌, ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్లా, వికారాబాద్‌, జనగాంలో ఒక్కో మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. వీటిలో మేడ్చల్ జిల్లాలోని మెడికల్ కాలేజీ అరుంధతి ట్రస్ట్, హైదరాబాద్‌లో కాలేజీ సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో కాలేజీ కొలంబో ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు కాబోతుండగా, మిగిలిన 9 కాలేజీలు ప్రభుత్వం అధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్నాయి. 

ఏపీలో ఏలూరు, మచిలీపట్నం నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ 2023-24 నుంచే ఇవి 150 సీట్లతో ప్రారంభం అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. 

Related Post