ప్రభుత్వాలు మారినా జూడాల పరిస్థితి మారదా?

June 22, 2024
img

ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కొత్తగా అనేక వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయించారు. ప్రతీ జిల్లాలో సకల సౌకర్యాలతో ప్రభుత్వాసుపత్రులు నిర్మింపజేశారు.

హైదరాబాద్‌ నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఉస్మానియా ఆసుపత్రిని, దానిలో పనిచేస్తున్న వైద్యులను, ముఖ్యంగా జూనియర్ డాక్టర్లని అసలు పట్టించుకోలేదు.

భారీ వర్షం పడినప్పుడల్లా వార్డులలోకి వరద నీరు ప్రవహిస్తుండేది. ఉస్మానియా హాస్పిటల్ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో నిత్యం మరమత్తులు తప్పనిసరి అవుతుండేది. ఇక జూనియర్ డాక్టర్స్ తమ సమస్యలని పరిష్కరించమని ఎన్నిసార్లు ధర్నాలు చేశారో లెక్కేలేదు. 

వైద్య రంగానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేసిన కేసీఆర్‌ ఉస్మానియా హాస్పిటల్‌ని ఎందుకు పట్టించుకోలేదో ఇప్పుడు చర్చ అనవసరం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా తమ సమస్యలు, పరిస్థితి అలాగే ఉన్నాయంటూ జూనియర్ డాక్టర్లు నేడు హాస్పిటల్ ముందు కళ్ళకు గంతలు కట్టుకొని ధర్నా చేసి నిరసన తెలియజేశారు. 

తమకు నెల నెలా ఇచ్చే స్టైఫండ్ కోసం ప్రతీనెల అధికారుల చుట్టూ తిరిగాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమలో చాలామంది వివాహితులు కూడా ఉన్నామని, తమ కుటుంబపోషణకు ప్రభుత్వం ఇచ్చే ఈ స్టైఫండ్స్ ఆధారమని, కానీ ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి స్టైఫండ్ ఇస్తుంటే తాము ఎలా బ్రతకాలని పీజీ మెడికోలు ప్రశ్నించారు.

ప్రతీనెల సచివాలయానికి వెళ్ళి సంబందిత అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే తప్ప స్టైఫండ్స్ విడుదల కావడం లేదని ఇకనైనా ప్రతీ నెల నిర్ధిష్టమైన తేదీకి తమ స్టైఫండ్స్ చెల్లించేలా ఏర్పాటు చేయాలన్నారు. 

ఇక ఉస్మానియా పాత భవనాన్ని మూసి వేసి పక్కనే ఉన్న భవనాలలో రోగులను సర్దుబాటు చేయడం వలన అక్కడ పరిమితికి మించి రోగుల సంఖ్య పెరిగిపోయిందని, దాని వలన వారు ఇబ్బంది పడుతుండటమే కాక ఒకరి నుంచి మరొకరికి, తమకు కూడా వారి నుంచి ఇన్ఫెక్షన్స్ సోకుతున్నాయని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ప్రొఫెసర్ కోదండరామ్‌, కొందరు అధికారులు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటి గురించి చెప్పామని, వారు సానుకూలంగా స్పందించారు కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. కనుక ఈసారి లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. 

Related Post