విదేశాల నుంచి వచ్చేవారికి మార్గదర్శకాలు జారీ

November 29, 2021
img

కరోనా మళ్ళీ ఒమిక్రాన్‌ అనే కొత్త రూపంలో ఆఫ్రికా దేశాలలో శరవేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రప్రభుత్వం యూరోప్, ఆఫ్రికాతో 11 దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి మార్గదర్శకాలు జారీ చేసింది.

• ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లు గుర్తించిన అన్ని దేశాల ప్రయాణికులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. వాటిలో సింగపూర్, చైనా, హాంగ్‌కాంగ్‌, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బ్రిటన్, న్యూజిలాండ్‌, బ్రెజిల్, బోట్స్ వానా, మారిషస్, ఇజ్రాయెల్ దేశాలున్నాయి.  

• ప్రయాణికులకు విమానాలలో టికెట్ జారీ చేసే ముందే విమానయాన సంస్థలు తప్పనిసరిగా వారి వద్ద నుంచి కరోనా లేదని తెలియజేస్తూ స్వీయ దృవీకరణ పత్రం, ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్ట్ (నెగెటివ్) ఆన్‌లైన్‌లో తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే టికెట్ జారీ చేయరాదు. 

• భారత్‌లో దిగిన తరువాత విమానాశ్రయంలోనే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. నెగెటివ్ అని తేలితే వారం రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలి. ఆ తరువాత మరోసారి పరీక్ష చేయించుకొని నెగెటివ్ అని తేలితే ఎవరికివారు తమ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించుకొంటూ కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

• ఒకవేళ పాజిటివ్ అని తేలితే వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందించాలి. మళ్ళీ 8వ రోజున కూడా ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి పాజిటివ్ అని వస్తే జన్యు పరీక్ష చేయించుకోవాలి. దానిలో ఒమిక్రాన్ లేదని తేలిన తరువాతే డిశ్చార్జ్ చేయవలసి ఉంటుంది. 

• కరోనా, ఒమిక్రాన్‌ ముప్పు లేని దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నవారికి లేదా 5 శాతం మందికి మాత్రం విమానాశ్రయాలలో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలి. నెగెటివ్ వస్తే 14 రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలి. పాజిటివ్ వస్తే జన్యు పరీక్ష చేసుకొని, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. 

• 5 ఏళ్ళలోపు పిల్లలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించాలి.

Related Post