మరో మంచి పధకం..శభాష్!

February 22, 2018
img

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల అవసరాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని తెరాస సర్కార్ ఎప్పటికప్పుడు ‘టైలర్ మేడ్’ సంక్షేమ పధకాలను రూపొందిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో విద్యార్ధులు అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకుల విద్యాలయాలు, కెజిబివి, మోడల్ స్కూల్స్ అన్నిటిలో కలిపి మొత్తం 30 లక్షల మంది విద్యార్ధులు చదువుకొంటున్నారు. వారిలో 8 లక్షల మంది విద్యార్ధినులకు మొదట హెల్త్ కార్డులు అందించడానికి రాష్ట్ర విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఆగస్ట్ లోగా విద్యార్దినులు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ ఒక్కరికీ హెల్త్ కార్డులు, ‘హెల్త్ అండ్ హైజిన్ కిట్స్’ అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 



ముఖ్యంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్ధినులు యుక్త వయసులో అడుగుపెడుతున్నప్పుడు వారికి తెలియని అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కనుక వాటిలో పనిచేస్తున్న మహిళా ఉపాద్యాయులకు వైద్య ఆరోగ్యశాఖ చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించి, శిక్షణ పూర్తి చేసుకొన్న ఆ ఉపాద్యాయునులు చేత తరచూ విద్యార్ధినులకు తమ ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన తరగతులు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుకోవడానికి నిరుపేద విద్యార్ధులే వస్తుంటారు. కనుక వారికుండే సమస్యలు కూడా చాలా ఎక్కువే. ప్రభుత్వమే వారి ఆరోగ్య సంరక్షణకు బాధ్యత స్వీకరించడం చాలా మంచి నిర్ణయం. ఇటువంటి మంచి ఆలోచన చేస్తున్నందుకు తెలంగాణా ప్రభుత్వానికి అభినందనలు.  

Related Post