ప్రభుత్వం మాటలకు..చేతలకు పొంతన లేదేమిటి?

November 17, 2017


img

తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలలో విద్యావ్యవస్థపై జరిగిన చర్చలలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి సమాధానం చెపుతూ, ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కోట్లాది రూపాయల ఖర్చు తాలూకు గణాంకాలు వివరించి, ఆ డబ్బుతో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో చేపట్టిన అనేక అభివృద్ధి పనుల గురించి వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో, ప్రభుత్వ హాస్టల్స్ లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని, రాష్ట్రంలో అన్ని హాస్టల్స్ లో విద్యార్ధులకు ఒకేరకమైన నాణ్యమైన ఆహారం అందించేందుకు ఒకే రకమైన మెనూను అమలుచేస్తున్నామని చెప్పారు. ఇది చలీకాలం కనుక విద్యార్ధుల స్నానాలు చేయడానికి కొన్ని హాస్టల్స్ లో వేన్నీళ్ళ సౌకర్యం కూడాకల్పించామని తెలిపారు. 

కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పూర్తి భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. జగిత్యాల్ జిల్లాలోని సారంగపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలుర సంక్షేమ హాస్టల్ ను అందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆ హాస్టలో సుమారు 300 మంది విద్యార్ధులున్నట్లు సమాచారం. కానీ వారికి కనీస వసతి సౌకర్యాలు లేవు. ప్రస్తుతం కరీంనగర్, జగిత్యాల్ తదితర ప్రాంతాలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. అంత చలిలో వారు పడుకోవడానికి మంచాలు లేవు.. కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. హాస్టల్ కిటికీ తలుపుల రెక్కలు విరిగిపోవడంతో చల్లగాలి లోపలకు వస్తుంది. విద్యార్ధులు తమ పుస్తకాలు, బ్యాగులను కిటికీలకు అడ్డం పెట్టి అంత చలిలో కటిక నేలపై పడుకొంటున్నారు. కొంతమంది విద్యార్ధులు తమ ఇంటివద్ద నుంచి తెచ్చుకొన్న చిరిగిపోయిన పాత దుప్పట్లతో కాలం వెళ్ళబుచ్చుతుంటే మిగిలినవారు అవి కూడా లేక చలిలో గజగజలాడుతూ పడుకొంటున్నామని తెలిపారు. ఈ చలికి తోడూ దోమల బాధ కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు. రాత్రి ఎలాగో కాలక్షేపం చేసి లేస్తే ఆ చలిలోనే చల్లటి నీళ్ళతో స్నానాలు చేయవలసిరావడం వారికి మరో అగ్నిపరీక్ష. 

ఈ సమస్యలు కేవలం సారంగాపూర్ హాస్టల్ కే పరిమితం కావు. ఖమ్మం జిల్లాలో కల్లూరులోని ఎస్సీ హాస్టల్, మిట్టపల్లిలో ఎస్సీ హాస్టల్, కరీంనగర్ లోని సంక్షేమ హాస్టల్, కోరుట్లలోని సోషల వెల్ఫేర్ హాస్టల్...ఇలా చాలా పెద్ద జాబితాయే ఉంది. అన్ని చోట్ల నిరుపేద విద్యార్ధులు ఈ సమస్యలతో సతమతమవుతూ వాటిని ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక మౌనంగా భరిస్తున్నారు. 

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, సంక్షేమ హాస్టల్స్ లోని ఈ పరిస్థితులలో మార్పు ఎందుకు కనబడటం లేదు? ఈ సమస్యలు ఇంకా ఎప్పుడు పరిష్కారం అవుతాయి? గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందించగల ఆశా వర్కర్స్, వివిధ శాఖల ఉద్యోగులు, వారిపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖలకు ఐఏఎస్ హోదా గల ఉన్నతాధికారులతో కూడిన చాలా విస్తృతమైన నెట్ వర్క్ ఉన్నప్పటికీ, దిగువ స్థాయిలో నెలకొన్న ఇటువంటి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? దీనికి ఎవరు బాధ్యులు? అనే సందేహాలు కలుగుతాయి. హాస్టల్స్ లో దయనీయమైన ఈ పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వం చెపుతున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనలేదనే భావన కలుగుతోంది. 



Related Post