మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాద్రాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణాలలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ చేత విచారణ జరిపిస్తుండటం, కమీషన్ కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరడం, వారిరువురూ విచారణకు హాజరు కాకుండా కమీషన్‌కు ఘాటుగా లేఖలు వ్రాయడం అందరికీ తెలిసిందే.
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నందున విద్యుత్ కొరత తీర్చేందుకు చట్టబద్దంగా, నియమ నిబంధనల ప్రకారం ఆ నిర్ణయాలు తీసుకున్నామని, కనుక వాటిపై విచారణ, దాని కోసం జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ ఏర్పాటు రెండూ అవసరమే లేదని, కనుక కమీషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. కానీ కమీషన్ ఏర్పాటు సబబే అని విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు తీర్పు చెప్పడంతో ఆ తీర్పుని సవాలు చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
నిజానికి ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన నేరం. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు అందరూ తాము కేసీఆర్ ఆదేశం మేరకే తాము నడుచుకున్నామని చెపుతున్నారు. కనుక ఆ కేసు విచారణ కాస్త ఆలస్యం కావచ్చు కానీ అంతిమంగా దానిలో కేసీఆర్ చిక్కుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
కనుక ఆ కేసుని అడ్డుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతారనుకుంటే, జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఈ కేసులో తాను చిక్కుకునే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది.
ఒకవేళ సుప్రీంకోర్టు కూడా జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ ఏర్పాటుని సమర్ధిస్తే కేసీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడమే కాకుండా, ఈసారి కమీషన్ నోటీస్ పంపితే తప్పనిసరిగా విచారణకు హాజరు కావలసి ఉంటుంది. కానీ కమీషన్‌ను రద్దు చేయాలని ఆదేశిస్తే కేసీఆర్‌కు పెద్ద ఉపశమనం లభిస్తుంది.