ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు లక్ష కోట్లు విలువచేసే ఎన్నికల హామీలను అమలుచేయవలసి ఉంది. కనుక ఆదాయ వనరుల కోసం ఆన్వేషిస్తోంది. దానిలో భాగంగా ఆసరా పింఛన్లు, రైతు బంధు పధకాలను అందుకున్న అనర్హులకు నోటీసులు జారీ చేసి ఆ సొమ్ము అంతా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురపాలక సంఘం అధికారులు దాసరి మల్లమ్మ (80)కి పెన్షన్ రికవరీ నోటీస్ ఇచ్చారు. ఆమెకు నెలకు సుమారు రూ.23 వేలు పెన్షన్ అందుకుంటూ, ఆసరా పింఛన్ కూడా తీసుకున్నారని, కనుక ఇంతవరకు తీసుకున్న పింఛన్ సొమ్ము రూ.1,72,928 ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
దీనిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ, “కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది...” అంటూ సోషల్ మీడియాలో ఆమె ఫోటో, పెన్షన్ రికవరీ నోటీసుతో సహా ఓ పెద్ద సందేశం పెట్టారు.
ప్రభుత్వం అమలుచేసే ఏ సంక్షేమ పధకాలలోనైనా కొన్ని లోపాలు, కొంత అవినీతి, అక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
నిరుపేద రైతులు పంటలు వేసే ముందు డబ్బు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోకూడదనే సదుద్దేశ్యంతో గత ప్రభుత్వం రైతుబంధు పధకం ప్రవేశపెట్టింది. కానీ దానిని వందల ఎకరాలున్న భూస్వాములకు, రాజకీయ నాయకులకు వర్తింపజెసి వేలకోట్లు వారికి ముట్టజెప్పింది. సంక్షేమ పధకాలలో లోపాలకు ఇదే ఓ చక్కటి ఉదాహరణ.
ఇదేవిదంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్లను చాలా మంది అనర్హులు కూడా అందుకుంటుంటారు. కనుక ప్రభుత్వమే ఎప్పటికప్పుడు వారిని గుర్తించి తొలగిస్తుండాలి. తొలగించకపోతే అది ప్రభుత్వ తప్పిదమే. కానీ ఈవిదంగా ఇచ్చిన సొమ్ముని వెనక్కు తిరిగి ఇవ్వాలని కోరుతూ రికవరీ నోటీసులు జారీ చేయడం సరికాదు.
దీని వలన ప్రభుత్వ ప్రతిష్ట, ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట మసక బారుతుంది. బిఆర్ఎస్ పార్టీ ఈవిదంగా వేలెత్తి చూపే అవకాశం కల్పించిన్నట్లవుతుంది కూడా అని గ్రహిస్తే మంచిది.