బిఆర్ఎస్‌లో మరో వికెట్?

July 04, 2024


img

బిఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యే, నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ త్వరలో మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పుకొంటున్నప్పటికీ, ఎమ్మెల్యేలు ఎవరూ ఆయన మాటలను నమ్మడం లేదు. గత నెలలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ గులాబీ కారు దిగి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. 

జూలై నెలలో మరొక ఎమ్మెల్యే బోణీ కొట్టబోతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బుధవారం రాత్రి కొందరు కాంగ్రెస్‌ నేతలతో రహస్యంగా సమావేశమయ్యారు. కనుక త్వరలోనే ఆయన కూడా కారు దిగి కాంగ్రెస్‌ స్నేహ హస్తం అందుకోవడం ఖాయమే అని భావించవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 31కి తగ్గుతుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 72కి పెరుగుతుంది. 

కేసీఆర్‌ తమ ప్రభుత్వం జోలికి రాకపోతే తాము కూడా బిఆర్ఎస్‌ జోలికి రామని సిఎం రేవంత్‌ రెడ్డి రెండు నెలల క్రితమే ఓ మంచి ప్రతిపాదన చేశారు. కానీ కేసీఆర్‌ నేటికీ త్వరలో బిఆర్ఎస్‌ అధికారంలోకి రాబోతోందని, రెండు నెలల్లో ఈ మార్పు జరుగబోతోందని చెప్పుకుంటున్నారు. అందుకే సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కూడా  తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముందే ఈవిదంగా జాగ్రత్తపడుతున్నారని చెప్పవచ్చు. అంటే బిఆర్ఎస్‌ పార్టీ ఖాళీ అయిపోవడానికి కూడా కేసీఆర్‌, ఆయన ధోరణే కారణం అనుకోవాలేమో?


Related Post