ఆగస్ట్ 15వ తేదీలోగా పంట రుణాల మాఫీ చేస్తామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. ఇదికాక రైతు భరోసా, రైతు భీమా పధకాలు ఉండనే ఉన్నాయి. కనుక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తేయగానే సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వీటన్నిటికీ నిధులు సమకూర్చుకునేందుకు మార్గాలు ఆన్వేషిస్తున్నారు.
వీటన్నిటికీ కలిపి రాబోయే రెండు నెలల్లో సుమారు రూ.30,000 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. అప్పుడే రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో రైతులు ప్రభుత్వం అందించే ఈ ఆర్ధిక సాయం కోసం ఆతుత్రగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ వీటి గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
సరిగ్గా ఈ సమయంలో కామారెడ్డి జిల్లాలోని లింగంపేట సహకార కేంద్ర బ్యాంకు మండలంలోని పోల్కంపేటలోని ఓ రైతు తీసుకున్న పంటరుణం తిరిగి చెల్లించనందుకు అతని పొలాన్ని స్వాధీనం చేసుకుని ఈ నెల 20న వేలం వేస్తున్నట్లు పొలంలో ఫ్లెక్సీ బ్యానర్ పెట్టడం కలకలం సృష్టించింది.
దీనిపై స్థానిక రైతులు, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్, ఆ పార్టీ నేతలు బ్యాంకు ఎదుట బైటాయించి నిరసన తెలియజేశారు. రైతు పొలాన్ని వేలం వేస్తామంటూ పొలంలో ఫ్లెక్సీ బ్యానర్ పెట్టినందుకు రైతుకు క్షమాపణలు చెప్పి తక్షణం ఆ బ్యానర్ తొలగించాలని, వేలంపాట నోటీసుని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఫ్లెక్సీ బ్యానర్ వార్త అన్ని న్యూస్ ఛానల్స్, పత్రికలలో ఫోటోతో సహా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే డీసీసీబీ అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సదరు రైతు 2010లో తన పొలం బ్యాంకులో తనకా పెట్టి రుణం తీసుకున్నారని దాని అసలు, వడ్డీ కలిపి రెండింతలు అయ్యిందని, ఆ బాకీ బాకీ తీర్చకుండా తమ వద్ద తనకాలో ఉన్న ఆ పొలాన్ని మరొకరికి విక్రయిస్తున్నారని తెలిసి ఈ క్రయవిక్రయాలను అడ్డుకునేందుకే పొలంలో ఫ్లెక్సీ బ్యానర్ పెట్టాల్సి వచ్చిందని బ్యాంక్ అధికారులు మంత్రికి వివరించారు.
అయితే ఈ ఘటనతో పంట రుణాలు తీసుకున్న రాష్ట్రంలో రైతులందరూ ఆందోళన చెందేలా చేసింది. కనుక బిఆర్ఎస్ పార్టీ వారి తరపున ప్రభుత్వంపై పంట రుణాల మాఫీ చేయాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో అధికార, ప్రతిపక్షాల మద్య మరో రాజకీయ యుద్ధం మొదలైంది.