ఒకరు ఓ రంగంలో విజయం సాధిస్తే గొప్ప విషయమే. కానీ రెండు లేదా అంతకు మించిన రంగాలలో విజయాలు సాధిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడుగా సినీ ప్రేక్షకులను మెప్పించారు. జనసేనతో రాజకీయాలలో ప్రవేశించినప్పుడు వరుసగా ఎదురుదెబ్బలు తిన్నప్పుడు రాజకీయాలకు పనికిరాడనే అనుకున్నారు అందరూ.
కానీ పవన్ కళ్యాణ్ పట్టుదలగా ప్రయత్నిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండటం చేత రాష్ట్రంలోను, కేంద్ర ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ పలుకుబడి పెరిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఇంతగా రాణించడం చాలా సంతోషించవలసిన విషయమే. కానీ సినిమాల సంగతి ఏమిటి?
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలు మొదలుపెట్టి రాజకీయాలలో బిజీ అవడంతో మద్యలో ఆగిపోయాయి. కనుక ఇప్పుడు ఆ మూడు పూర్తి చేయాల్సి ఉంటుంది.
కానీ జనసేన తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ శాసనసభలో అడుగుపెట్టి, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కనుక అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వపరంగా కూడా పవన్ కళ్యాణ్‌పై అనేక కొత్త బాధ్యతలు ఏర్పడ్డాయి.
ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలుచేయాల్సిన బాధ్యత ఉంది. మంత్రిగా అధికారులతో సమన్వయం ఏర్పరచుకుని ప్రభుత్వ వ్యవహారాల గురించి అవగాహన పెంచుకోవలసి ఉంటుంది. కనుక ఇది ఆయనకు, జనసేనకు కూడా కీలక సమయం.
ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ మంత్రి బాధ్యతలను, పార్టీ బాధ్యతలను పక్కన పెట్టి మూడు సినిమాలు పూర్తిచేస్తారా? చేయకపోతే ఆ సినిమాలు, నిర్మాతల పరిస్థితి ఏమిటి?
ఒకవేళ ఈ మూడు సినిమాలు ఏదో విధంగా పూర్తి చేసినా, ఆ తర్వాత కొత్త సినిమాలు చేయగలరా లేదా? చేయలేకపోతే సినీ రంగం నుంచి తప్పుకుంటారా?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభిస్తాయి.