తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు?

April 12, 2024


img

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ వంటి వ్యవస్థను తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు.

ఇందిరమ్మ కమిటీల పేరుతో నడిచే ఈ వ్యవస్థలో ఒక్కో కమిటీలో 5 మంది సభ్యులు చొప్పున మొత్తం 80,000 మంది సభ్యులను (వాలంటీర్లు) నియమించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.6,000 గౌరవ వేతనం చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు, సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు అందిస్తోంది. వారి ద్వారానే ప్రభుత్వ పధకాల గురించి ఇంటింటికీ ప్రచారం చేయిస్తోంది. వారి ద్వారానే ప్రజలకు సంబందించి కీలకమైన సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా వైసీపి వ్యూహాలు, కార్యక్రమాలు రూపొందించుకుంటోంది.

వాలంటీర్లను పార్టీ కార్యక్రమాలకు యధేచ్చగా వాడుకుంటోంది. ఏపీలో ఈ ప్రయోగం విజయవంతం అవడంతో తెలంగాణలో కూడా దీనిని అమలుచేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. 

తెలంగాణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూనే, వారిని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రచారం కోసం వాడుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఈ కమిటీలలో సభ్యులుగా తీసుకొని వారికి నెలకు రూ.6,000 జీతం చెల్లిస్తుండటం ద్వారా వారికి ఆర్ధికసాయం అందజేసి ఆదుకున్నట్లవుతుంది. కనుక వారు కూడా పార్టీ, ప్రభుత్వం కోసం మరింత కష్టపడి పనిచేస్తారు. 

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఉద్యోగాలలో కొనసాగిస్తామని, ప్రస్తుతం నెలకు రూ.5,000 జీతాన్ని రూ.10,000కి పెంచుతామని ప్రకటించారు. 

అంటే వైసీపి సృష్టించిన ఈ వ్యవస్థను టిడిపి కూడా కాదనలేని పరిస్థితి నెలకొందన్న మాట!. కనుక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకి రంగం సిద్దమవుతోంది.


Related Post