తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి దళితులకు విముక్తి కల్పించి రాజ్యాధికారం సాధిస్తానంటూ ప్రగల్భాలు పలికిన చివరికి ఆ కేసీఆర్ దొర పంచనే చేరి బిఆర్ఎస్ పార్టీని గెలిపించమంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఇంతకు ముందు కేసీఆర్‌కు చాలా అహంభావం ఎక్కువని విమర్శలు గుప్పించిన ప్రవీణ్ కుమారే ఇప్పుడు కేసీఆర్ మంచోడు, రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని వాదిస్తున్నారు.
కరీంనగర్‌లో బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన యుద్ధభేరీ సభలో ప్రసంగిస్తూ, “కరీంనగర్‌లో వినోద్ కుమార్‌కి, గుట్కా ప్యాకెట్ల బ్యాచ్‌కు మద్య జరుగుతున్న యుద్ధమిది. పదేళ్ళ బిఆర్ఎస్ నిజమైన పాలనకు, 100 రోజుల అబద్ధాల కాంగ్రెస్ పాలనకు మద్య జరుగుతున్న యుద్ధం ఇది.
తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు, రాజకీయ అహంకారంతో విర్రవీగుతున్న వారికీ మద్య జరుగుతున్న యుద్ధమిది. కనుక కరీంనగర్‌లో వినోద్ కుమార్‌ని గెలిపించుకొని ఈ రాజకీయ దురహంకారులను ఓడించి తగిన విదంగా ప్రజలే బుద్ధి చెప్పాలి, “అని ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రవీణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నుంచి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు, తాను ఎల్లప్పుడు బడుగు బలహీన వర్గాల పక్షానే నిలిచి పోరాడుతానని, మాట తప్పితే తనను రాళ్ళతో కొట్టాలని ప్రజలకు సూచించారు.
దళితుల కోసం పోరాడుతున్నానని నమ్మబలికిన ఆయన ఎంపీ టికెట్ కోసం బీఎస్పీకి రాజీనామా చేసి బిఆర్ఎస్‌లో చేరినప్పుడే వారికి ఇచ్చిన మాట తప్పారు. కానీ ఇంకా బడుగు బలహీన వర్గాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక ఆయనకే ప్రజలు బుద్ధి చెప్పక మానరు.