చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ని ప్రధాని మోడీ నిన్న ఢిల్లీ నుంచి వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టెర్మినల్ నుంచి ట్రెయిన్ నంబర్: 070777 చర్లపల్లి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
రూ.430 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించారు. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ ఫారంలు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి. చర్లపల్లి నుంచి ప్రతీరోజు 25 జతల రైళ్ళలో 50,000 మంది ప్రయాణించేందుకు వీలుగా చాలా సువిశాలంగా నిర్మించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఎంఎంటిఎస్ రైళ్ళలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కి చేరుకోవచ్చు. ఇక నుంచి లింగంపల్లికి నుంచి బయలుదేరే రైళ్ళు సికింద్రాబాద్ వెళ్ళకుండా సనత్ నగర్, అమ్ముగూడ మీదుగా నేరుగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వస్తాయి.