వందే భారత్‌ విజయవాడ వరకే పరిమితం?

November 28, 2022
img

అత్యాధునిక సదుపాయాలతో గంటకు 160 కిమీ వేగంతో పరుగులు తీసే వందే భారత్‌ రైలు ప్రస్తుతానికి విశాఖపట్నం-విజయవాడ నగరాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదట ఈ రెండు నగరాల మద్య ప్రారంభించి తర్వాత మరో ర్యాక్ (రైలు) కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మద్య నడిపించాలని దక్షిణమద్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.

వచ్చే నెల రెండో వారంలో విశాఖ నుంచి విజయవాడకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండటం గమనిస్తే వందే భారత్‌ సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభం అవడానికి మరికొంత సమయం పట్టవచ్చని స్పష్టం అవుతోంది. ప్రస్తుతం విశాఖ-విజయవాడ మద్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 6 గంటలకు పైగా సమయం పడుతోంది. అదే... వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అయితే కేవలం 4 గంటలలో చేరుకోవచ్చు. 

విశాఖ నుంచి విజయవాడకు నడిపే బదులు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు వందే భారత్‌ రైలు నడిపి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకు రైలు కేటాయించినట్లు ఉండేది. పైగా విశాఖపట్నం-విజయవాడ కంటే సికింద్రాబాద్‌-విజయవాడ మద్య రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జనవరిలో సంక్రాంతి పండుగలోగా ఈ రైలు అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బహుశః ఆలోగానే దీనిని సికింద్రాబాద్‌ వరకు పొడిగిస్తారేమో? 

Related Post