శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు

November 28, 2022
img

హైదరాబాద్‌ ప్రజలకు చాలా ఉపయోగపడేవిదంగా మెట్రో సర్వీసులను నగరం నలుదిక్కులా విస్తరించినప్పటికీ ఇంతవరకు శంషాబాద్‌ విమానాశ్రయానికి అనుసంధానం చేయకపోవడం ఒక్కటే లోటుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ లోటును కూడా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిమీ పొడవునా హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.6,250 కోట్లు ఖర్చు అవుతుందని మెట్రో ప్రాజెక్టుని  నిర్మించి నిర్వహిస్తున్న ఎల్&టి అధికారులు అంచనా వేసి ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. దానికి సిఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. వచ్చే నెల  9వ తేదీన మెట్రో ప్రాజెక్టు పొడిగింపు పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఏవిషయం రాష్ట్ర ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలియజేశారు. ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయసహకారాలు అందజేస్తుందని ఆశిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలలో కొనసాగుతోంది. కనుక నష్టాల భారం తగ్గించుకోవడానికి త్వరలో టికెట్‌ చార్జీలను పెంచేందుకు కమిటీ నివేదిక సమర్పించబోతోంది. బహుశః జనవరి నుంచి టికెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. నష్టాలలో ఉన్నప్పుడు మళ్ళీ అదనపూ భారం తలకెత్తుకోవడం దేనికి? అనే సందేహం కలుగవచ్చు. ఇంతకాలం హైదరాబాద్‌ మెట్రోని శంషాబాద్‌ విమానాశ్రయంతో కలుపడంలో ఆలస్యం జరగడం వలననే నష్టాలకు ఓ కారణమని భావిస్తున్నారు. విమానాశ్రయంతో కలిపితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది కనుక మళ్ళీ లాభాలబాట పట్టవచ్చని హైదరాబాద్‌ మెట్రో సంస్థ భావిస్తోంది.  

Related Post