హైదరాబాద్‌లో నేటి నుంచి 100 శాతం సిటీ బస్సులు

September 21, 2021
img

కరోనా కారణంగా ఇంతకాలంగా హైదరాబాద్‌ నగరంలో టీఎస్‌ఆర్టీసీ 50 శాతం సిటీ బస్సులను మాత్రమే తిప్పుతోంది. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి విద్యాసంస్థలు, కార్యాలయాలు అన్నీ మళ్ళీ తెరుచుకొంటుండటంతో నేటి నుంచి నగరంలో 100 శాతం సిటీ బస్సులను నడిపించబోతున్నట్లు హైదరాబాద్‌ రీజినల్ మేనేజర్ చెరుకుపల్లి వెంకన్న తెలిపారు. 

హైదరాబాద్‌లో నేటి నుంచి 1,286 సిటీ బస్సులు, 265 అద్దె బస్సులు కలిపి మొత్తం 1,551 బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సైతం నేటి నుంచి బస్ సర్వీసులను పురుద్దరిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో రోజుకి 18,478 ట్రిప్పులు, 4.25 లక్షల కిలోమీటర్లు ఉంటాయని చెరుకుపల్లి వెంకన్న తెలిపారు. 

నేటి నుంచి అందుబాటులోకి తెచ్చిన అన్ని సిటీ బస్సులను పూర్తిగా శానిటైజ్ చేశామని కనుక ప్రయాణికులు నిర్భయంగా బస్సులలో ప్రయాణించవచ్చని తెలిపారు. బస్సులలో ప్రయాణించేవారు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆ తరువాత వరుసగా రెండుసార్లు లాక్‌డౌన్‌లతో టీఎస్‌ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు 100 శాతం సిటీ బస్సులను తిప్పితే టీఎస్‌ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం పెరుగుతుంది కనుక మరి కాస్త ఉపశమనం లభిస్తుంది.

Related Post