జనరల్ బోగీలో సీట్లకు రిజర్వేషన్

September 15, 2021
img

సామాన్యులు మొదలు ఉన్నత వర్గాల వరకు అందరూ రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రిజర్వ్ బోగీలలో ప్రయాణం పర్వాలేదు కానీ జనరల్ బోగీలో ప్రయాణమంటే నరకమే అని అందరికీ తెలుసు. బోగీలోకి ప్రవేశించడమే కష్టం. సీటు లభించడం ఇంకా కష్టం. కనుక సీటు దొరక్కపోతే ఎంత దూరప్రయాణమైనా నిలబడి ప్రయాణించక తప్పదు. పరిమిత సంఖ్యలో జనరల్ బోగీలు ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. కానీ బోగీలను పెంచడం సాధ్యం కాదు కనుక ఈ సమస్యకు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ పరిష్కారం కనుగొన్నారు. 

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బయమెట్రిక్ టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. జనరల్ బోగీలో ప్రయాణించాలనుకొనేవారు టికెట్ తీసుకొన్నాక ఈ టోకెన్ యంత్రం వద్ద టోకెన్ తీసుకొన్నట్లయితే వారికి బోగీలో సీటు కేటాయించబడుతుంది. బోగీలోకి టోకెన్ ఉన్నవారిని మాత్రమే ముందుగా అనుమతిస్తారు. కనుక టోకెన్ తీసుకొంటే సీటు లభించినట్లే. 

ఈ టోకెన్ యంత్రంలో ప్రయాణికుడి పేరు, టికెట్ పీఎన్‌ర్‌ నెంబర్, రైలు నెంబరు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తారు వగైరా వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్‌లో వేలిముద్ర, ఫోటో తీసుకొని సీటు నెంబరు కేటాయించబడుతుంది. బోగీ వద్ద ఉండే రైల్వే పోలీసులకు ఆ టోకెన్ చూపిస్తే లోపలకు అనుమతిస్తారు. టోకెన్ల ద్వారా బోగీలో అన్ని సీట్లు నిండిన తరువాత నిలబడి ప్రయాణించాలనుకొనేవారిని అనుమతిస్తారు.

Related Post