భారత్‌లో మరో టీకా త్వరలో...

April 13, 2021
img

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం, వాక్సిన్ల కొరత ఏర్పడుతుండటంతో రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కి చెందిన ఎస్‌ఈసీ నిపుణుల కమిటీ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి సిఫార్సు చేసింది. డీసీజీఐ సిఫార్సును ఆమోదించడం లాంఛనప్రాయమే కనుక త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వాక్సిన్లు అందుబాటులో ఉన్నందున ఇప్పుడు స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తే దేశంలో వాక్సిన్ల కొరత తగ్గుతుంది. 

భారత్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, హెటిరో కంపెనీలు స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నాయి. దీని కోసం మూడు సంస్థలు ఈ టీకాను తయారుచేసిన రష్యన్ కంపెనీ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌) ఒప్పందం కుదుర్చుకొన్నాయి. వాటిలో డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్ 12.5 కోట్ల స్పుత్నిక్-వి వ్యాక్సిన్లను డోసులను ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ 60 దేశాలలో వినియోగిస్తున్నారు. కరోనాను అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్‌కు 90 శాతం కంటే ఎక్కువ సమర్ధంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాలలో రుజువైంది. భారత్‌లో ఒక్కో వాక్సిన్ డోస్ ధర సుమారు రూ.750 వరకు ఉండవచ్చని అంచనా.

Related Post