ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మన్ జార్జ్ ముత్తూట్ మృతి

March 06, 2021
img

దేశంలో బంగారు ఆభరణాల తనఖాలు పెట్టుకొని రుణాలు ఇచ్చే అతిపెద్ద సంస్థ ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌. దాని చైర్మన్ జార్జ్ ముత్తూట్ (77) శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారిపడి మరణించారు. 

ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్   గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ ఆయన 3వ తరానికి చెందినవారు. కేరళలోని కోజెన్‌చేరిలో జన్మించిన ఆయన 30 ఏళ్ళ వయసులోనే...1979లో ముత్తూట్‌ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 1993లో ఆయన ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌గా చేపట్టి రూ.8,722 కోట్లు టర్నోవర్ బిజినెస్ సాధించారు. ఆయన నేతృత్వంలో ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రూ.51,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. దేశవ్యాప్తంగా 550 శాఖలు, 20 రకాల వ్యాపారాలు చేస్తున్న సంస్థగా ముత్తూట్ సంస్థకు మంచి పేరుంది. ఫోర్బ్స్ ఆసియా సంపన్నుల జాబితా-2020లో జార్జ్ ముత్తూట్ 500 కోట్ల డాలర్లతో 44వ స్థానంలో ఉన్నారు.   

ఆయన అర్ధాంగి పేరు సారా ముత్తూట్. వారి ముగ్గురు కుమారులలో పెద్దవాడు జార్జ్ ఎం జార్జ్, మూడో కుమారుడు  అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్‌ ప్రస్తుతం ముత్తూట్‌లోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, డైరెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు పాల్ ముత్తూట్ జార్జ్ 2009లో హత్యకు గురయ్యారు. జార్జ్ ముత్తూట్ చనిపోవడంతో పెద్దకుమారుడు జార్జ్ ఎం జార్జ్ సంస్థ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

Related Post