త్వరలో రైల్వేలో జీరో బేస్‌డ్‌ విధానం అమలు

July 06, 2020
img

రైల్వేశాఖ త్వరలో జీరో బేస్‌డ్‌ విధానం అమలుచేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నూతన విధానం అమలులోకి వస్తే, ఏదైనా స్టేషన్లో రైళ్లలో ఎక్కే, దిగే ప్రయాణికులు లేనట్లయితే ఆ స్టేషన్లలో రైళ్లు ఆగవు. ఒకవేళ క్యాటరింగ్ లేదా సరుకు లోడింగ్ కోసం ఆపవలసివచ్చినా ఎక్కువ సమయం ఆగవు. ఇప్పటివరకు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్ రైళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీ రైల్వేస్టేషన్‌లోను ఆగి ముందుకు వెళుతున్నాయి. ఇకపై వాటికి కూడా ఈ జీరో బేస్‌డ్‌ విధానం అమలుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

అవసరం లేనిచోట్ల రైళ్ళు ఆపకుండా ముందుకు సాగడం వలన ప్రయాణసమయం తగ్గడమే కాకుండా, రైల్వేశాఖకు ఇందనం కూడా మిగులుతుంది. అలాగే స్టేషన్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అవసరం లేనిచోట రైళ్ళు ఆగకపోతే రైళ్లలో ఎక్కేవారు ఉండరు కనుక రైళ్ళలో దొంగతనాలు కూడా కరోనా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. కనుక ప్రయాణికులు భద్రంగా తమ గమ్యస్థానాలు చేరుకోవచ్చు.

ప్రస్తుతం పరిమిత సంఖ్యలో తిరుగుతున్న ప్రత్యేకరైళ్లకు రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా ఈ జీరో బేస్‌డ్‌ విధానం అమలుచేస్తోంది. ఈ విధానంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోగలుగుతుండటంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందనవస్తోంది.

Related Post