ఆన్‌లైన్ బాట పట్టిన ఐకియా, హైదారాబాద్

May 27, 2020
img

ప్రపంచప్రసిద్ధి చెందిన ఐకియా సంస్థ ఆగస్ట్ 2018లో హైదరాబాద్‌ మొట్టమొదటి ఫర్నీచర్ మాల్‌ను ప్రారంభించినప్పుడు అదో పెద్ద సంచలనం. లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ ఫర్నీచర్ మాల్‌లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే వేలాదిరకాల కుర్చీలు, సోఫా సెట్లు, డైనింగ్ టేబిల్స్, మంచాలు, పరుపులు, కప్ బోర్డులు వగైరా వగైరాలు చూపు తిప్పుకోనీయవు. అటువంటి షో రూమ్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైదరాబాద్‌వాసుల నుంచి ఐకియాకు అపూర్వమైన ఆదరణ లభించింది. హైదరాబాద్‌లో ఐకియా ప్రారంభమైన తరువాత అక్కడికి వచ్చే వాహనాల కారణంగా ఆ పరిసర ప్రాంతాలలో నిత్యం ట్రాఫిక్ జామ్‌లు అవుతుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వందల కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐకియా ఫర్నీచర్ మాల్‌ అతి తక్కువ కాలంలోనే భారీగా లాభాలు ఆర్జించిందని వేరే చెప్పక్కరలేదు. 

కానీ లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి దేశంలో మూతపడిన అనేక సంస్థలలో ఐకియా కూడా ఒకటి. కనుక రెండు నెలలుగా అమ్మకాలు నిలిచిపోవడంతో భారీగా నష్టపోతోంది. పైసా ఆదాయం లేకపోయినప్పటికీ అంత పెద్ద ఫర్నీచర్ మాల్‌ నిర్వహణ వ్యయం, వందలాదిమంది ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడం కూడా చాలా కష్టమే. ఒకవేళ జూన్ 1 నుంచి ఐకియాను కూడా తెరిచేందుకు అనుమతించినప్పటికీ కరోనా భయంతో ఇదివరకులా ప్రజలు రాకపోవచ్చు. కనుక ఐకియా కూడా మరికొంత కాలంపాటు కరోనా కష్టాలు తప్పకపోవచ్చు. 

ఈ సమస్యను అధిగమించడానికి ఐకియా ఆన్‌లైన్‌ ఫర్నీచర్ బుకింగ్, డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదివరకే ఐకియా, ముంబై బ్రాంచిలో ఈ విధానంలో ఫర్నీచరును డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌, పూణే నగరాలకు కూడా డోర్ డెలివరీ సౌకర్యం కల్పించింది. కానీ దేశంలో ఇతర నగరాలు, పట్టణాలకు ఈ సౌకర్యం విస్తరించకపోవడం ఆశ్చర్యకరం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, సంస్థలు ఫ్రిజ్జులు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు వంటి భారీ వస్తువులను డోర్ డెలివరీ చేసి లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, అంతర్జాతీయ సంస్థ అయిన ఐకియా దేశంలో అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు డోర్ డెలివరీ చేయలేదనుకోలేము. అప్పుడే ఆ సంస్థ కరోనా కష్టాల నుంచి, లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడగలదు.

Related Post