అమెరికాలోని లాస్ ఎంజిలీస్ నగరంలో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఎవరూ ఊహించని ఓ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన తనదైన శైలిలో నవ్వులు పండిస్తూ చాలా హుషారుగా అవార్డుల ప్రధానోత్సవాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులలో కూర్చొని ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ఈ కార్యక్రమానికి బోడిగుండుతో రావడాన్ని గమనించిన క్రిస్ రాక్ ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ, ”ఏమిటి...మీరు జిఐ జేన్ సినిమా సీక్వెల్‌లో నటించబోతున్నారా?” అంటూ జోక్ పేల్చాడు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ గుండుతో కనిపిస్తుంది.
అప్పుడు ఆమె పక్కనే కూర్చొని ఉన్న విల్ స్మిత్ లేచి స్టేజి వద్దకు వస్తుంటే అతను ఏదో చెప్పడానికి వస్తున్నాడనుకొన్న క్రిస్ రాక్ నవ్వుతుంటే, అందరూ చూస్తుండగా విల్ స్మిత్ అతని చంప చెళ్ళుమనిపించేలా కొట్టి అంతే వేగంగా స్టేజి దిగి వెళ్ళిపోయాడు. దీంతో అతనీతో పాటు ఆ కార్యక్రమానికి హాజరైనవారందరూ షాక్ అయ్యారు. అయితే ఇదేదో సరదాగా జరిగిందని అనుకొంటుంటే, విల్ స్మిత్ “షటప్... నా భార్య గురించి మరోసారి మాట్లాడకు..” అంటూ గట్టిగా కోపంతో అరిచాడు. అయితే క్రిస్ రాక్ వెంటనే తేరుకొని ‘వావ్...వావ్...ఓకే.. ఓకే.. అంటూ ఏమీ జరగనట్లు నవ్వుతూ కార్యక్రమాలను కొనసాగించాడు.
ఇంతకీ విల్ స్మిత్‌కి అంత కోపం రావడానికి చాలా బలమైన కారణమే ఉంది. అతని భార్య జాడా పింకెట్‌కి ‘ఆలోపెసియా’ అనే ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. ఆ వ్యాధి కారణంగా ఆమె తలపై జుట్టు అంతా రాలిపోయి బోడి గుండులా మారింది. అందుకు వారిరువూరు చాలా బాధ పడుతున్నారు. ఈ విషయం హాలీవుడ్‌లో అందరికీ తెలుసు. కానీ క్రిస్ రాక్‌కి ఈ విషయం తెలియక జాడా పింకెట్‌పై జోక్ పేల్చి ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యాడు.
అయితే బహిరంగంగా ఇంత అవమానం జరిగినా అతను స్టేజి దిగి వెళ్ళిపోకుండా “టెలివిజన్ చరిత్రలో ఇది ఓ గొప్ప రాత్రిగా నిలిచిపోతుంది,” అంటూ చెప్పి నవ్విస్తూ హుందాగా తన కార్యక్రామాన్ని కొనసాగించడం చాలా గొప్ప విషయమే. ఆ తరువాత కొద్ది సేపటికి విల్ స్మిత్ ‘ఉత్తమ నటుడి’గా ఆస్కార్ అవార్డ్ అందుకోవడానికి వచ్చినప్పుడు క్రిస్ రాక్‌కి ఆయనను స్టేజిపైకి ఆహ్వానించాడు. జరిగిన ఘటనకు విల్ స్మిత్ అందరికీ క్షమాపణలు చెప్పారు కానీ క్రిస్ రాక్‌ని కొట్టి అవమానించినందుకు అతనికి మాత్రం క్షమాపణ చెప్పలేదు.