ఇద్దరు యువరాజులకు ఇదే చివరి అవకాశం?

March 13, 2019


img

నెహ్రూ కుటుంబానికి చెందినందున అక్కడ రాహుల్ గాంధీ, వైఎస్ కుటుంబానికి చెందినందున ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి ‘అధికారం తమ జన్మహక్కు’ అని భావిస్తుండటం అందరికీ తెలిసిందే. అయితే వారిరువురూ ఇంతవరకు అధికారపీఠం ఎక్కలేకపోయారు. 

కాంగ్రెస్‌ పార్టీ 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా అప్పుడు భయపడి స్వీకరించలేదు. ధైర్యం తెచ్చుకొనేసరికి ఆ కుర్చీలో నరేంద్రమోడీ సెటిల్ అయిపోయారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఆయనను ఆ కుర్చీలో దించి తాను దానిలో కూర్చోవాలని రాహుల్ గాంధీ చాలా తహతహలాడుతున్నారు. 

గత ఎన్నికలలో మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. కానీ ఈసారి అందరికీ తెలిసున్న కొన్ని కారణాల వలన నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా కొంత ఎదురుగాలులు వీస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి కొత్త మిత్రులు లభించారు. కనుక రాహుల్ గాంధీకి ఈ లోక్‌సభ ఎన్నికలు గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఈ అవకాశాన్ని కూడా చేజార్చుకొంటే రాహుల్ గాంధీ తన జీవితంలో మరెన్నటికీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కలుగకపోవచ్చు. కనుక డిల్లీ యువరాజుకు ఇదే చివరి అవకాశమని చెప్పవచ్చు. 

ఇక ఏపీ యువరాజు జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైయస్సార్ చనిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని చాలా ఆరాటపడుతున్నారు. గత 10 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్‌ తన కల నెరవేర్చుకోలేకపోయారు. 

అక్కడ డిల్లీ యువరాజు రాహుల్ గాంధీకి అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడినట్లే, ఇక్కడ ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డికి కూడా చాలా అనుకూల వాతావరణం ఏర్పడిందిప్పుడు. తెరాస బహిరంగ మద్దతు, బిజెపి (కేంద్రప్రభుత్వం) పరోక్షమద్దతు, టిడిపి నేతల తీరుపై రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి, టిడిపికి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడంవంటివన్నీ జగన్‌మోహన్‌రెడ్డికి కలిసివచ్చే అంశాలు. కనుక ఏప్రిల్ 11న జరుగబోయే ఎన్నికలు జగన్‌కు ఒక గొప్ప...చివరి అవకాశం వంటివేనని చెప్పవచ్చు. ఒకవేళ ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆయన ముఖ్యమంత్రి కల నెరవేరుతుంది లేకుంటే వచ్చే ఎన్నికలనాటికి వైకాపా కకావికలమైపోయే ప్రమాదం పొంచి ఉంది కనుక మరెన్నటికీ ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు. కనుక ఈ ఇద్దరు యువరాజులకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యవంటివేనని చెప్పవచ్చు. 

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నిష్పక్షపాతంగా వాస్తవదృష్టితో చూసినట్లయితే వారిద్దరిలో జగన్‌మోహన్‌రెడ్డి అధికారపీఠం దక్కించుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ రాహుల్ గాంధీకి డౌటే. ఎందుకంటే కాంగ్రెస్‌ సొంతబలంతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. కనుక దానికి మద్దతు ఇవ్వాలనుకొంటున్న ఇతర పార్టీలలో చాలా మంది ప్రధానమంత్రి కుర్చీపై కన్నేసి ఉన్నారు. వారికి ఆ కుర్చీని త్యాగం చేయడానికి రాహుల్ గాంధీ అంగీకరిస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకొనే అవకాశాలు మెరుగుపడతాయి. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలిచినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం కష్టమే.


Related Post