నగదు సరఫరా చేయలేనప్పుడే కనికరిస్తారా?

April 19, 2018
img

దేశంలో ఆర్ధిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థలు ఇప్పుడున్నంత దయనీయమైన పరిస్థితిలో మునుపెన్నడూ లేవు. బడాబాబులు బ్యాంకుల నుంచి వేలకోట్లు అప్పనంగా పట్టుకొని పోతుంటే, మరోపక్క సామాన్య ప్రజలు వంద రూపాయల కోసం బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసివస్తోంది. ఇంతవరకు సామాన్య ప్రజలను జరిమానాల కొరడాతో తాటతీస్తున్న బ్యాంకులు ఇప్పుడు నగదుకొరత ఏర్పడటంతో ప్రజాగ్రహాన్ని చూసి కాస్త వెనక్కు తగ్గుతున్నాయి. 

ఒకప్పుడు సామాన్యప్రజల మనసు దోచిన బ్యాంక్ గా పేరుబడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నోట్ల రద్దు తరువాత వారికి నరకం చూపుతోంది. దేశ వ్యాప్తంగా దానికి ఎటిఎంలు ఉన్నప్పటికీ వాటిలో చాలా మూతపడ్డాయి లేదా ‘నో క్యాష్’ బోర్డు కనబడుతుంటుంది. ఇప్పుడు అది కూడా వెనక్కు తగ్గి ప్రజలపై వడ్డింపులు కాస్త తగ్గించుకోవడానికి సిద్దపడింది. 

నగదు కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈరోజు కాస్త ఉపశమనం కలిగించే ఒక ప్రకటన చేసింది. దేశంలో అన్ని నగరాలు, పట్టణాలలో గల రిటైల్ దుఖాణాలలో గల ఎస్.బి.ఐ. పోస్ యంత్రాలలో’ డెబిట్ కార్డుల ద్వారా రోజుకు రూ.2,000 వరకు చేసే కొనుగోళ్ళపై ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. టైర్-1, టైర్-2 నగరాలలో రోజుకు రూ.1,000, టైర్-3 నుంచి టైర్-6వరకు రోజుకు రూ.2,000 పరిమితి విధించింది. టైర్-1, టైర్-2 నగరాలలో రూ.1,000 నగదు కూడా తీసుకోవచ్చునని, దానికి ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని ఎస్.బి.ఐ. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ ఒక ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. 

ఎస్.బి.ఐ. చేసిన ఈ ప్రకటన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేదే కానీ దేశంలోకెల్లా అతిపెద్ద జాతీయ బ్యాంక్ నుంచి రూ.1,000 డ్రా చేసుకోవడం నేడు చాలా గొప్ప విషయం అయిపోయింది అంటే అందుకు ప్రజలు సంతోషించాలా...లేక ఆ బ్యాంక్ సిగ్గుపడాలా?సరిపడినంత నగదు ఉన్నపుడు ప్రజలతో ఒకలాగ, లేనప్పుడు మరొకలాగ వ్యవహరించడం చూస్తే బ్యాంకుల స్థాయి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఎప్పటికైనా మార్పు వస్తుందో రాదో?

Related Post