ఇస్రో నేడు మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు వందల కొద్దీ ఉపగ్రహాలు ప్రయోగించిన ఇస్రో వాటన్నిటి కంటే అత్యంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3-ఎం5 ఉపగ్రహవాహక నౌక 4,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని మోసుకొని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది.
అంత భారీ ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్నప్పటికీ అది ఖచ్చితమైన వేగంతో దూసుకుపోయి నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో చరిత్రలో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఘన, ద్రవ ఇందనాలతో పనిచేసే ఎల్‌వీఎం3-ఎం5 అత్యంత భారీ ఉపగ్రహాన్ని మోసుకుపోవడం మరో విశేషం.
2013 నుంచి సేవలందిస్తున్న జీశాట్-7 కాలపరిమితి ముగుస్తుండటంతో దాని స్థానంలో దీనిని ప్రవేశపెడుతోంది కనుక దీనిని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు. భారత్ సముద్ర తీరం నుంచి సుమారు 2,000 కిమీ దూరం వరకు భారత్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు ఇది సేవలు అందిస్తుంది. భారత్ నావికాదళం రహస్య సమాచారాన్ని శత్రు దేశాలు గుర్తించలేని విధంగా ఇది సేవలు అందిస్తుంది.
అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగం విజయవంతం అవడంతో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఇస్రో చైర్మన్ నారాయణన్‌ని, ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. వారు కూడా ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు.