గల్ఫ్ కార్మికుల కోసం కేటిఆర్ తపన

May 09, 2017
img

ఒకప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్ళినవారు బాగా డబ్బు సంపాదించుకొన్న మాట వాస్తవమే కానీ గత 2-3 దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలలో పరిస్థితులు చాలా మారాయి. అక్కడికి వెళ్ళిన, ఇంకా వెళుతున్న భారతీయ కార్మికులు, సాంకేతిక నిపుణులు ఊహించని సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇక పొట్టచేత పట్టుకొని వెళ్ళే నిరుపేదల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఏజంట్ల మోసాలు, అక్కడ యజమానుల దోపిడీకి గురవుతున్నారు. దేశం కాని దేశంలో ఆదుకొనేవారు లేక అనారోగ్యం, ఆకలితో అలమటిస్తు చనిపోయిన వారు కూడా ఉన్నారు. చనిపోయిన తరువాత వారి శవాలను కూడా వెనక్కి రప్పించుకోలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ జంట నగరాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. 

మంత్రి కేటిఆర్ నిన్న డిల్లీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి వారి సమస్యల పరిష్కారం కోసం కొన్ని మంచి సూచనలు చేశారు. ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. కేటిఆర్ చేసిన సూచనలు:

1. గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారి వివరాలను కేంద్రప్రభుత్వమే నమోదు చేసి ఒక డాటా బ్యాంక్ తయారు చేయాలి. దానిని అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలి. తద్వారా ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది ఏఏ దేశాలకు వెళ్ళారు? వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వంటి వివరాలు తెలుసుకొని అవసరమైనప్పుడు వారికి తగిన సహాయ సహకారాలు అందించవచ్చు.

2. గల్ఫ్ దేశాలలో తెలుగు కార్మికులు చాలా ఎక్కువ మంది పని చేస్తున్నారు కనుక అక్కడ ప్రతీ ఎంబసీలో ఒక తెలుగు అనువాదకుడిని నియమించాలి. 

3. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నవారు ఏదైనా కేసులలో చిక్కుకొన్నట్లయితే వారికి న్యాయసహాయం చేసేందుకు ప్రతీ ఎంబసీలో ఒక భారతీయ న్యాయవాదిని నియమించాలి. 

4. అక్కడ వివిధ కేసులలో చిక్కుకొని జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయులకు మిగిలిన శిక్షా కాలం ఇక్కడ భారత్ లో వారి స్వంత రాష్ట్రాలలో పూర్తి చేసుకొనేందుకు గల్ఫ్ దేశాలను ఒప్పించాలి.

5. కొన్ని సంస్థలు, యజమానులు తమ వద్ద పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల పాస్ పోర్టులను బలవంతంగా తీసుకొని వారితో చాలా దారుణంగా వ్యవహరిస్తూ మనవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. అటువంటి వారికి సహాయపడేందుకు తగిన వ్యవస్థలు రూపొందించాలి.

6. గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి సమస్యలను చర్చించి, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకొని  వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా కొంతమంది మంత్రులతో కూడిన ఒక కమిటీ వేయాలి. ప్రతీ 2-3నెలలకు ఒకసారి వారు సమావేశం కావాలి. వారి సూచనల మేరకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. 

Related Post