తెలుగు సినిమాలకి పుట్టిల్లు ఏపీలో అడుగడుగునా ఆటంకాలే!

January 06, 2023
img

తెలుగు సినీ పరిశ్రమ పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ ఏపీకి చెందినవారే కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలుగు సినీ పరిశ్రమకి పుట్టిల్లు వంటిదని చెప్పుకోవచ్చు. వారిలో చాలా మంది టిడిపితో సంబంధాలున్నవారే లేదా చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌లతో సినిమాలు చేస్తున్నవారే.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుండటంతో తెలుగు సినిమా పరిశ్రమకి పుట్టింట్లోనే అనేక సమస్యలు, ఆటంకాలు ఎదుర్కోవలసివస్తోంది. ఏపీలో సాగుతున్న వికృత రాజకీయాల ప్రభావం సినిమాలపై పడుతుండటంతో వాటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతున్నారు. 

ఇందుకు తాజా ఉదాహరణగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌ గురించి చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం ఒంగోలులో ఏబీఎం కళాశాల ఆవరణలో నిర్వహించేందుకు పోలీసులు అనుమతించడంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. కానీ చివరి నిమిషంలో అక్కడ కార్యక్రమానికి అనుమతించలేమని, స్థానిక బీఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రాకి చెందిన మైదానంలో జరుపుకోవాలని పోలీసులు సూచించారు. 

ఈ కార్యక్రమానికి సుమారు లక్షన్నర రెండు లక్షల మంది వస్తారనే అంచనాతోనే నిర్వాహకులు పదిరోజుల ముందుగా పోలీసుల అనుమతి తీసుకొని అందుకు తగ్గట్లు ఏబీఎం కళాశాల ఆవరణలో అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. అక్కడ ఈ కార్యక్రమం జరుగబోతోందని ప్రచారం చేసుకొన్నారు. కానీ పోలీసులు అవన్నీ చూస్తూ ఊరుకొని  చివరి నిమిషంలో వేదిక మార్చవలసి రావడంతో మళ్ళీ మొదటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి వస్తోంది. 

ఇవి సరిపోవన్నట్లు పోలీసులు మళ్ళీ కొన్ని ఆంక్షలు విధించారు. అక్కడ పోలీస్ బందోబస్తు కోసం వెయ్యి మందిని నియమించినందున, వారి కోసం నిర్వాహకులు రూ.15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని ఆదేశించారు. బందోబస్తు కోసం పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వాహకులు బౌన్సర్లను, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొక్కిసలాటలు జరుగకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమానికి పోలీసులు పాసులు జారీ చేశారు. పాసులున్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెపుతున్నారు. దానికి నిర్వాహకులు కూడా అంగీకరించారు. కానీ మరికొన్ని గంటలలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుండగా పోలీసులు ఆ పాసులపై స్టాంపింగ్ చేయాలంటూ ఆలస్యం చేస్తుండటంతో నిర్వాహకులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

ఏపీలో టిడిపి, వైసీపీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతున్నందున హిందూపురం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య సినిమాకి ఈవిదంగా ఆటంకాలు కల్పిస్తోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కూడా సిఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ని సమర్ధిస్తుండటంతో వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి కూడా నిర్వాహకులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇక ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు విడుదల చేసుకోగలరో లేదో కూడా తెలీని పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకే సిఎం జగన్‌ స్వయంగా సినీ పరిశ్రమని ఏపీకి తరలిరావాలని ఆహ్వానించినా ఎవరూ హైదరాబాద్‌ విడిచిపెట్టి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు. 

Related Post