కోలీవుడ్ హీరో విజయ్ చివరి సినిమా జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు)కి నేడు మద్రాస్ హైకోర్టులో మళ్ళీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకి యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ తక్షణం జారీ చేయాలంటూ గురువారం ఉదయం సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సెన్సార్ బోర్డు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది.
దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ తీర్పుపై స్టే విధించి తదుపరి విచారణని జనవరి 21కి వాయిదా వేసింది. సింగిల్ జడ్జ్ చెప్పినప్పటికీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ జారీ చేయకుండా డివిజన్ బెంచికి వెళ్ళింది. కనుక అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం ఖాయంగానే భావించవచ్చు. కనుక జన నాయగన్ ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశం లేన్నట్లే భావించవచ్చు.
విజయ్ ఈ సినిమా తర్వాత సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి తన టివికే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఆయన సినిమాకి అవరోధంగా మారినట్లు పలువురు భావిస్తున్నారు.
ఆయన రాజకీయాలలోకి రావడం ఇష్టం లేని అధికార, ప్రతిపక్ష నాయకులు సెన్సార్ బోర్డుపై ఒత్తిడి చేసి సర్టిఫికేట్ జారీ చేయకుండా అడ్డుపడి ఉండవచ్చని కోలీవుడ్ భావిస్తోంది. ఆయన బిజేపితో పొత్తులు పెట్టుకునేందుకు నిరాకరించారు. కనుక ఈ సినిమా ఆగిపోవడం వెనుక బహుశః కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళు కూడా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.