ప్రభుత్వానికి, రాజాసాబ్‌కు హైకోర్టు షాక్!

January 09, 2026


img

రాజాసాబ్ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఇచ్చిన మెమోని హైకోర్టు కొట్టేసింది. గురువారం అర్దరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వం మెమో జారీ చేయగా, విజయ్‌ గోపాల్ అనే న్యాయవాది దానిపై అభ్యంతరం చెపుతూ నేడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇటువంటివాటికి మెమోలు జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు, పోలీస్ కమీషనర్లకు మాత్రమే ఉంటుందని, కానీ నిబందనలకు విరుద్ధంగా హోంశాఖ కార్యదర్శి మెమో జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 

న్యాయమూర్తి ఆయన వాదనలతో ఏకీభవిస్తూ ఆ మెమోని కొట్టివేస్తున్నట్లు చెప్పారు. ఇదివరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి) మళ్ళీ ఎన్నడూ సినిమా టికెట్ ఛార్జీలు పెంచమని చెప్పారని గుర్తు చేశారు. మంత్రి చెప్పినా అర్దరాత్రి మెమోలో ఎందుకు జారీ చేస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా అధికారుల తీరు మారడం లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో తెలంగాణ అంతటా ప్రజలకు సాధారణ టికెట్ ధరలతోనే రాజాసాబ్ సినిమా చూసే అవకాశం లభించింది. ఏపీ ప్రభుత్వం టికెట్ ఛార్జీల పెంపుకి అనుమతించింది. కనుక అక్కడ మాత్రం రాజాసాబ్ చూడాలంటే జేబులు ఖాళీ చేసుకోవలసిందే.


Related Post

సినిమా స‌మీక్ష