ఓజీ... టికెట్ ఛార్జీల పెంపు కుదరదు!

September 24, 2025


img

సుజీత్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా చేసిన పూర్తి యాక్షన్ చిత్రం ఓజీ. రేపు (25న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఒకరోజు ముందుగా ఈరోజు అర్దరాత్రి ప్రీమియర్ షోలు కూడా పడబోతున్నాయి. అంటే మరికొన్నిగంటల్లో ఓజీ వచ్చేస్తుందన్న మాట! ఇలాంటి సమయంలో తెలంగాణ హైకోర్టుకి ఓజీకి పెద్ద షాక్ ఇచ్చింది. 

ఓజీ టికెట్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఓజీ నిర్మాతలకు, సినిమా థియేటర్లకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలతో సహా తొలి రోజు షోలన్నిటికీ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు హైకోర్టు ఆ జీవోని రద్దు చేసినందున, అదనంగా వసూలు చేసిన ఆ సొమ్ముని ప్రేక్షకులకు తిరిగిఇచ్చివేయాల్సి ఉంటుంది. లేకుంటే రేపు ప్రేక్షకులలో ఎవరో ఒకరు మళ్ళీ హైకోర్టులో కేసు వేస్తే అందరికీ మొట్టికాయలు పడతాయి. 

దీని వలన మొదటి పది రోజుల సినిమా కలక్షన్స్ కూడా తగ్గుతాయి. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే పర్వాలేదు. ఏమాత్రం తేడా కొట్టినా ఈ పది రోజుల అదనపు కలక్షన్స్ రావు కనుక నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉంటుంది.  

హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి కూడా అవమానకరమే. ప్రభుత్వం జారీ చేసే జీవోలను అప్పుడప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేయడం సర్వసాధారణమే. కానీ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఈవిదంగా చేయడంతో జీవోకి విలువ లేకుండా చేసినట్లయింది. 


Related Post

సినిమా స‌మీక్ష