తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు పగబట్టినట్లు వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే వర్షాలతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇకనైనా వర్షాలు తగ్గితే బాగుండే అనుకుంటే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడుతోందని కానీ మళ్ళీ మరో అల్పపీడనం ఏర్పడుతోందని తెలిపింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి 27న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మద్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బుధవారం వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.
శుక్రవారం సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనుక ప్రజలు, ప్రభుత్వాధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.