పవన్ కళ్యాణ్ కధానాయకుడుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎట్టకేలకు మళ్ళీ వచ్చే వారం నుంచి మొదలవబోతోంది. దీని కోసం విజయవాడలో ప్రత్యేకంగా సెట్ వేశారు.
వచ్చే వారం నుంచి పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాకి ఇదే ఆఖరి షెడ్యూల్. దీనిలో సుమారు 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ తను చేయవలసిన సన్నివేశాలను పూర్తిచేయబోతున్నారు. బహుశః 10-15 రోజులలో ఈ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.
చారిత్రిక నేపధ్యంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవడంతో దర్శకుడు మారారు. ఇప్పుడు క్రిష్ స్థానంలో జ్యోతీ కృష్ణ మిగిలిన సన్నివేశాలకు దర్శకత్వం వహించబోతున్నారు.
ఈ సినిమాని రెండు భాగాలలో తీయాలని మొదట అనుకున్నప్పటికీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా పవన్ కళ్యాణ్ చాలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో రెండో భాగం చేసే అవకాశం లేదనే భావించవచ్చు. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.