కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టారు మృతి

November 29, 2021


img

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టారు (72) ఇక లేరు. కరోనాతో హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో పాటు కరోనా బారినపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన పెద్ద కుమారుడు, హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న ఆయన భార్య ఇద్దరూ కొలుకొంటున్నట్లు సమాచారం. ఆయన చికిత్సకు సోనూసూద్, చిరంజీవి, ధనుష్ తదితర పలువురు సినీ ప్రముఖులు ఆర్ధికసాయం అందజేసినప్పటికీ ఆయన మరణించడంతో అందరూ ఆవేదన చెందుతున్నారు. 

శివశంకర్ మాస్టర్ సుమారు 800కి పైగా సినిమాలకు నృత్యదర్శకత్వం వహించారు. ముప్పైకి పైగా సినిమాలలో నటించారు కూడా. అలనాటి మేటి నటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్‌, శోభన్ బాబు, కృష్ణ, మొదలు చిరంజీవి, బాలకృష్ణ, నేటి యువతరం హీరోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ తదితరుల సినిమాలకు కూడా ఆయన నృత్యదర్శకత్వం వహించారు. రాజమౌళి, రామ్ చరణ్‌ల సూపర్ డూపర్ హిట్ సినిమా మగధీరలో ధీరధీర పాటకు ఉత్తమ నృత్యదర్శకుడిగా ఆయన జాతీయ పురస్కారం అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ 16వ ఏట ప్రారంభమయిన ఈ నృత్య ప్రస్థానం 2021 వరకు అంటే సుమారు 5 దశాబ్ధాల పాటు అత్యంత విజయవంతంగా కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్‌ మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 


Related Post

సినిమా స‌మీక్ష