ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ పక్కా

December 09, 2017


img

ఖమ్మం జిల్లాలో బయ్యారంలో స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ శుక్రవారం డిల్లీలో కేంద్ర ఉక్కుశాఖామంత్రి బీరేంద్ర సింగ్ ను కలిసి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి మాట్లాడారు. అనంతరం వారిరువురూ కలిసి మీడియాతో మాట్లాడారు. 

మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, “పాల్వంచలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఎన్.ఎం.డి.సి. ఆర్ధిక, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తోంది. మరో నెలరోజుల్లో దాని నివేదిక వచ్చే అవకాశం ఉంది. అదిరాగానే ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభిస్తాము. పాల్వంచలో మూతపడున్న స్పాంజ్ ఐరన్ కర్మాగారానికి చెందిన 450 ఎకరాలు తీసుకొని దానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో గానీ, కేంద్రం-ప్రైవేట్ భాగస్వామ్యంలో గానీ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము. ఈ కర్మాగారానికి అవసరమైన ముడి ఇనుమును ఎన్.ఎం.డి.సి., బొగ్గును సింగరేణి సంస్థలు అందిస్తాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారానే సింగరేణి నుంచి బొగ్గును కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ స్టీల్ ప్లాంట్ కు అందించవచ్చు. ఏడాదికి 10.5 లక్షల టన్నులు ఇనుము ఉత్పత్తి చేసేవిధంగా ఈ ఆర్క్ ఫర్నీస్ ప్లాంట్ ను నిర్మించబోతున్నాము,” అని చెప్పారు. 


Related Post