మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా!

October 24, 2026


img

హైదరాబాద్‌లోని కవాడిగూడ పవర్‌గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా అమర్చిన ఓ మొబైల్ ఫోన్ బయటపడింది. దీనిపై సదరు మహిళా ఉద్యోగిని పై అధికారులకు పిర్యాదు చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ప్రాధమిక దర్యాప్తులోనే ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ ఈ మొబైల్ ఫోన్ అమర్చినట్లు గుర్తించి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఆ ఫోన్‌ స్వాధీనం చేసుకొని దానిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించగా వారు దానిలో అతను ఏమైనా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడా?చేస్తే వాటిని వేరెవరికైనా పంపించాడా?అనే కోణంలో పరిశీలిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 13న పవర్‌గ్రిడ్ కార్యాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న మహిళల వాష్‌రూమ్‌లో ఈ మొబైల్ ఫోన్ బయటపడింది. ఓ మహిళా ఉద్యోగిని వాష్ రూమ్‌కు వెళ్ళినప్పుడు, వాష్‌బేసిన్ కింద తెల్ల కాగితంతో కప్పి ఉంచిన ఓ వస్తువును గుర్తించారు.

మొదట అది రూమ్ ఫ్రెషనర్ అని భావించినప్పటికీ, మళ్ళీ అనుమానం వచ్చి తెల్లకాగితం తీసి చూస్తే  వాష్‌బేసిన్ కింద టేప్‌తో అతికించిన మొబైల్ ఫోన్ కనిపించింది.

ఇక్కడ ఈ ఫోన్ ఎందుకుంది? ఇది ఎవరిదని ఆమె ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ను ప్రశ్నించగా, అతడు ఆమె చేతిలో నుంచి ఆ ఫోన్‌ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అక్కడి ఉద్యోగులు అతడిని పట్టుకుని , భద్రతా సిబ్బందికి అప్పజెప్పారు.

అయితే సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు భరత్ ఆ ఫోన్‌ను నేలకేసి కొట్టి పగులగొట్టాడు. అయినా ఆ ఫోన్ నుంచి డేటాను వెలికి తీసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


Related Post