భద్రాచలానికి కొత్తగా రైలు మార్గం ఏర్పాటు కాబోతోంది. ఓడిశాలోని మల్కన్ గిరి నుంచి ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాండురంగాపురం వరకు రూ.2,864 కోట్లు వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు. దీనికోసం మూడు రాష్ట్రాలలో 843.9 హెక్టార్లు భూసేకరణ చేయాల్సి ఉంటుంది.
దీనిని ప్రత్యేకమైన ప్రాజెక్టుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాబోయే 5 ఏళ్ళలో దీనిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే ప్రయాణాలకు మాత్రమే కాదు. ఒడిశా నుంచి బొగ్గు, ముడి ఇనుము, ఇతర ఖనిజాలు రవాణాకు, అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల రవాణాకు కూడా ఉపయోగించుకునే విధంగా నిర్మిస్తున్నారు.
ఈ కొత్త రైలు మార్గంలో సాధారణ మరియు సరుకు రవాణా రైళ్ళు గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణిం చేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. భద్రాచలం నుంచి మల్కన్ గిరి వరకు 173.6 కిమీ పొడవునా నిర్మించబోతున్న ఈ రైల్వే మార్గంలో అనేక వంతెనలు ఉంటాయి కానీ ఎక్కడా ఒక్క లెవెల్ క్రాసింగ్ కూడా ఉండదు.
ఈ మార్గంలో భద్రాచలం వద్ద గోదావరిపై భారీ వంతెనతో పాటు మొత్తం 300కి పైగా వంతెనలు, 41 ఆర్వోబీలు, 66 ఆర్యూబీలు నిర్మించనున్నారు.
ఇతర శాఖల ప్రాజెక్టులతో పోలిస్తే రైల్వేశాఖ ఆమోదించిన ప్రాజెక్టులు నిర్దిష్టమైన గడువులోనే పూర్తవుతుంటాయనే విషయం తెలిసిందే. కనుక 2031 నాటికి భద్రాచలం రైల్వే స్టేషన్ అక్కడికి రైళ్ళ రాకపోకలు ప్రారంభం కావడం తధ్యం.