తెలంగాణలో వర్షాలు షురూ

June 09, 2026


img

తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌తో సహా కొన్ని జిల్లాలలో వర్షాలు మొదలయ్యాయి. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలలో కుండపోతగా వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఈసారి వేసవిలో సగటున 45 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఆ వేడి భరించలేక అల్లాడిపోయారు. మంత్రదండం వేసి తిప్పినట్లు వరుణ దేవుడు ఒక్కసారిగా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేశారు. 

నేడు, రేపు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్‌ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది.  బుధవారం ఈ జిల్లాలతో పాటు వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. 

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, హైటెక్ సిటీ, ముషిరాబాద్, అబీడ్స్, నారాయణగూడా తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది.          



Related Post