సానుకూలంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికులు-మంత్రుల సమావేశం

April 24, 2026


img

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకున్న నేపధ్యంలో ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు. ముందుగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌ మృతికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు అయన మృతి పట్ల చాలా విచారం వ్యక్తం చేశారు. 

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెప్పిన సమస్యలన్నిటినీ సావధానంగా విని ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గతంలో మీరు సమ్మె చేసినప్పుడు మాజీ సిఎం కేసీఆర్‌ చాలా కఠినంగా వ్యవహరించారు. కానీ మేము ఆవిధంగా వ్యవహరించము. తెలంగాణ సాధనలో మీరు చాలా కీలకపాత్ర పోషించారు. మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది. అన్ని సమస్యలను కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాము,” అని అన్నారు. 

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, మీ 32 డిమాండ్లలో 29 డిమాండ్లపై మేము సానుకూలంగా స్పందించిన సంగతి మీకు తెలుసు. మిగిలిన మూడు డిమాండ్స్ కూడా పరిష్కరించుకుందాము.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు మళ్ళీ గుర్తింపు, పీఆర్‌సిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ చర్చలు సానుకూలంగా ముగిస్తే మంత్రుల అభ్యర్ధన మేరకు త్వరలోనే సమ్మె విరమించే అవకాశం ఉంది. 


Related Post