ఢిల్లీలో భారత్‌ టాక్సీ సేవలు ప్రారంభం

February 12, 2026


img

దేశంలో తొలిసారిగా భారత్‌ టాక్సీ సర్వీసులని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఢిల్లీలో ప్రారంభించారు.  ఇప్పటికే దేశంలో ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి పలు సంస్థలు ఇటువంటి సేవలు అందిస్తునాయి.

మరి భారత్‌ టాక్సీ ప్రత్యేకత ఏమిటంటే, వీటిపై వచ్చే ఆదాయంలో ఎవరికీ కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతీ ట్రిప్పుకి ఎంత వస్తుందో మొత్తం అంతా డ్రైవర్లకే నేరుగా లభిస్తుంది. పైగా దీనిలో ‘సారధి’ పేరుతో ఆరోగ్య భీమా, ప్రమాద భీమా, రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా అధనంగా లభిస్తాయి. 

భారత్‌ టాక్సీ సర్వీసుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్, పోర్టల్ రూపొందించింది. దీనిలో ఇప్పటికే మూడు లక్షల మంది వాహన ద్విచక్ర, ఆటోలు, కార్ల యజమానులు, డ్రైవర్లు నమోదు చేసుకున్నారు. అలాగే లక్ష మంది వినియోగదారులు కూడా భారత్‌ టాక్సీ సేవళ కోసం రిజిస్టర్ అయ్యారు. 

ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా నడిపించగా భారత్‌ టాక్సీకి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో రాబోయే మూడేళ్ళలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్‌ టాక్సీ సేవలను విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అమిత్ షా చెప్పారు.


Related Post