సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ మీడియాకు లీకులు ఇచ్చింది. కానీ వస్తారా లేక ఎప్పటిలాగే మొహం చాటేస్తారా? అనేది రేపు తెలుస్తుంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావినని గొప్పలు చెప్పుకుంటారు. కనుక ఆయన తెలివితేటలు ఏపాటివో రేపు శాసనసభ సమావేశాలలో పాల్గొని నిరూపించుకుంటే బాగుటుంది.
రెండేళ్ళుగా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేసిన కేసీఆర్, ప్రజా సమస్యల గురించి మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. ప్రజల మధ్యకు వెళ్ళకుండా ఫామ్‌హౌసులో కూర్చొని అయన ప్రజా సమస్యలున్నాయని ఎలా తెలుసుకున్నారో? ఇటీవల పార్టీ సమావేశంలో ఆయన చాలానే మాట్లాడారు. మా ప్రభుత్వాన్ని తోలు తీస్తానని బెదిరించారు.
కనుక అదేదో రేపు శాసనసభ సమావేశాలకు హాజరయ్యి మాట్లాడితే బాగుంటుంది. ఇన్ని ప్రగల్భాలు పలికి మళ్ళీ రేపు మొహం చాటేయకుండా వస్తే ఆయనకు గౌరవంగా ఉంటుంది. మేమూ ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెపుతాము,” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.