తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేరిట కొద్ది సేపటి క్రితం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఉభయసభలు సమావేశాలు ప్రారంభమవుతాయి.
మండలి భవనం మరమత్తులు ఇంకా పూర్తికానందున ఇదివరకులాగే నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గల కౌన్సిల్ హాలులో మండలి సమావేశాలు జరుగుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
సోమవారం ఒక్కరోజు లేదా మంగళవారం కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 సెలవు ఉంటుంది. మళ్ళీ జనవరి 2 నుంచి ఉభయసభలు సమావేశాలు కొనసాగుతాయి.
ఇటీవల కేసీఆర్ తెలంగాణ భవన్‌కి వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించేసిందని ఆరోపించారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
సిఎం రేవంత్ రెడ్డి సందిస్తూ, “మీరు చెప్పిన అంశాలపై శాసనసభలో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కనుక ఈసారైనా తప్పకుండా సమావేశాలకు వచ్చి చర్చలో పాల్గొనాలి,” అని విజ్ఞప్తి చేశారు. కానీ కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వస్తారో లేదో అనుమానమే!
కానీ ఈసారి ఇదే అంశంపై కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల మద్య వాడి వేడిగా వాదోపవాదాలు జరుగబోతున్నాయి. శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.