అమెరికా షట్ డౌన్‌... భలే ఉందే!

October 01, 2025


img

మనకి కరోనా సమయంలో ‘లాక్ డౌన్‌’ గురించి తెలుసు కానీ యావత్ దేశం ‘షట్ డౌన్‌’ అవడం ఎప్పుడూ చూడలేదు. కానీ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అమెరికా నిజంగానే (షట్ డౌన్‌) మూత పడింది.  

మంగళవారం అమెరికా సెనేట్‌లో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందకపోవడంతో, (భారత్‌ కాలమాన ప్రకారం) బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి అమెరికాలో ‘షట్ డౌన్‌’ మొదలైంది. 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, దేశ రక్షణ, వైద్యం, పోలీసులు వంటి అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన సాధారణ సర్వీసులలో పనిచేసే సుమారు 7 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, మరో అంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించేస్తుంది. 

ఈ ‘షట్ డౌన్‌’ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు, పార్కులు, లైబ్రేరీలు, మ్యూజియంలు వంటివి మూసివేశారు. వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈ ‘షట్ డౌన్‌’ ముగిసిన తర్వాత తిరిగి విధులకు హాజరుకావలసి ఉంటుంది. అంతవరకు ఉద్యోగులకు జీతాలు అందవు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ‘షట్ డౌన్‌’ ముగిసిన తర్వాత జీతాలు చెల్లిస్తారో లేదో తెలియని పరిస్థితి.

2018-19లో ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే అమెరికా ఇలాగే 35 రోజుల పాటు  ‘షట్ డౌన్‌’ అయ్యింది. దాని వలన అమెరికాకు దాదాపు 12-14 బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లుఅంచనా వేశారు. మళ్ళీ ట్రంప్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే మరోసారి ‘షట్ డౌన్‌’ అయ్యింది. ఈసారి ఎన్ని రోజులు ఈ ‘షట్ డౌన్‌’ కొనసాగుతుందో తెలీదు.


Related Post