ఫ్లై ఓవర్‌ పేరు మారింది... ఇకపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌

September 30, 2025


img

హైదరాబాద్‌ నగరంలో ‘తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌’ పేరు ‘తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌’ గా మారింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ బోర్డుని మార్చి కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. దానిపై తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ‘తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌’ అని ముద్రించారు. 

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఫ్లై ఓవర్‌ పేరు మార్చాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆమోదంతో పేరు మార్చి కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. 

నిత్యం ఈ ఫ్లై ఓవర్‌ మీదుగా రాకపోకలు సాగించే తెలంగాణవాసులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్ళు పైనే అయినా ఈ ఫ్లై ఓవర్‌కు ‘తెలుగు తల్లి’  పేరు ఇంకా మార్చలేదేమని అనుకోకుండా ఉండరు.

తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ హయంలో ఈ ఫ్లై ఓవర్‌ పేరు మార్చకపోయినా సిఎం రేవంత్ రెడ్డి హయంలో ఈ మార్పు జరిగింది. ఇందుకు తెలంగాణ ప్రజలు తప్పక హర్షం వ్యక్తం చేస్తారు.



Related Post