మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

September 13, 2025


img

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల భద్రకాళి ఆలయంలో ధర్మకర్తల మండలిలో ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీనిపై స్థానిక ఎమ్మెల్యే నాయిన రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలో గల ఆలయంలో తనకు మాట మాత్రం చెప్పకుండా సభ్యులను నియమించడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీలో సీనియర్ నాయకురాలు, మంత్రి పదవిలో ఉన్న ఆమె ఇలా ప్రతీ నియోజకవర్గంలో వేలు పెట్టడం సరికాదన్నారు. ఈవిషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. 

మంత్రి కొండా సురేఖ కూడా వెంటనే స్పందిస్తూ, “దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న నేను ఓ ఆలయంలో ఇద్దరు సభ్యులని నియమించుకోవడానికి కూడా వీల్లేదంటే ఎలా? అయినా నేనేమీ నా సొంత మనుషులను నియమించలేదు. అదీ ఛైర్మన్‌ పదవిలో కూడా కాదు. కమిటీలో సభ్యులుగా మాత్రమే నియమించాను.

ఈ మాత్రం దానికే ఆయన ఇంత రాద్దాంతం చేయడం సరికాదు. ఆయన వయసులో, అనుభవంలో నా కంటే చాలా చిన్న. నాకంటే ముందు నుంచే ఎమ్మెల్యే అవ్వాలని ప్రయత్నిస్తూ చివరికి అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఆ గౌరవం కాపాడుకుంటే బాగుంటుంది,” అని అన్నారు. 


Related Post