హైదరాబాద్‌కు మూడు వైపులా మూడు రైల్వే స్టేషన్స్

September 13, 2025


img

సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వేశాఖ ఇప్పటికే చర్లపల్లిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ రైల్వే టెర్మినల్ (స్టేషన్‌) నిర్మించింది. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ని ఆధునీకరిస్తోంది. 

కానీ నానాటికీ పెరుగుతున్న రైళ్ళు, ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి నగరం మూడు వైపులా కొత్తగా మరో మూడు భారీ రైల్వే టెర్మినల్స్ నిర్మించాలని దక్షిణ మద్య రైల్వే నిర్ణయించింది. 

రైల్వే అధికారులు శుక్రవారం సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మూడు టెర్మినల్స్ గురించి వివరించారు. తద్వారా బెంగళూరు, ముంబై, కోల్‌కతా  నగరాలకు సికింద్రాబాద్‌ మీదుగా రాకపోకలు సాగించే రైళ్ళను కొత్త టెర్మినల్స్ వరకు పరిమితం చేయవచ్చని తెలిపారు. 

ముంబై నుంచి రాకపోకలు సాగించే రైళ్ళ కోసం రామచంద్రాపురం మండలంలో నాగులాపల్లి వద్ద, నాందేడ్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ళ కోసం మేడ్చల్లోని డబిల్‌పురా వద్ద, అదేవిదంగా బెంగళూరు నుంచి రాకపోకలు సాగించే రైళ్ళ కోసం శంషాబాద్ సమీపంలో జూకల్ వద్ద వీటిని నిర్మించబోతునట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

తద్వారా సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా శివారు ప్రాంతాలలో నివసించే ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. 

ప్రస్తుతం నగర జనాభా 1.13 కోట్లు కాగా ఇది 2031 నాటికి  1.84 కోట్లు, 2047నాటికి 3.30 కోట్లకు చేరుకుంటుంది. కనుక భవిష్యత్ అవసరాలు, పెరిగే జనాభా, పెరిగే రైళ్ళు, పెరిగే రద్దీకి తగ్గట్లుగానే ఈ మూడు టెర్మినల్స్ నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపారు. 

వీటిలో నాగులాపల్లి వద్ద 320 ఎకరాల విస్తీర్ణంలో 20 ప్లాట్ ఫారాలతో, జూకల్ వద్ద 300 ఎకరాలలో 18 ప్లాట్ ఫారాలతో,  డబిల్‌పుర్ వద్ద 250 ఎకరాలలలో 14 ప్లాట్ ఫారాలతో రైల్వే టెర్మినల్స్ నిర్మించాలనుకుంటున్నట్లు దక్షిణ మద్య రైల్వే స్టేషన్‌ అధికారులు సిఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు.            



Related Post